
భారత దేశ నలుమూలలా ప్రతి ఒక్క పల్లెలో అయోధ్య రాముని ఆలయం ఉంటుందంటే అతిశయోక్తి లేదు. భదాద్రికి ( భద్రాచలం) సరి సమానమైన రామ క్షేత్ర అన్వేషణలో ప్రముఖంగా వినిపించిన రెండు క్షేత్రాలు ఒంటిమిట్ట ( కడప జిల్లా), మరియు శ్రీ రామ తీర్థం ( విజయనగరం ).
పూసపాటి రాజుల రాజధాని నగరంగా చరిత్రలో సుస్థిర స్థానం కైవసం చేసుకొని పాత కొత్త సంస్కృతులకు, పురాతన మరియు నూతన నిర్మాణాలకు కూడలిగా ఉత్తరాంధ్ర లో ఉన్నప్రసిద్ద నగరం విజియనగరం. ఈ రాజ వంశం వారు నిర్మించిన నూట ఆరు ఆలయాలలో శ్రీ రామ తీర్థం ఒకటి.
సన్నటి తారు రోడ్డుకు ఎడమ పక్కన నున్నగా, పచ్చదనం లేకుండా ఉన్న బోడి కొండలు.
కుడిపక్కన నాలుగు వందల సంవత్సరాల క్రిందట నిర్మించిన ఆలయం.
కొద్దిగా ఎత్తులో చుట్టూ ప్రహరీ గోడతో ఉన్న ఆలయ ప్రాంగణానికి ఉత్తరం పక్కన నూతనంగా అయిదు అంతస్థుల గాలి గోపురం నిర్మించారు.
పది ఎకరాల పై చిలుకు విస్తీర్ణంలో ఉన్న "భాస్కర పుష్కరణి", ఈ క్షేత్రంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న స్థలాలలో ఒకటి.
నేడు ఆలయంలో పూజలు అందుకొంటున్న మూల విరాట్టులు ఎవరి కంట పడకుండా వెయ్యి సంవత్సరాలు అజ్ఞాత వాసం చేసినది ఈ సరస్సులోనే !
అందుకే భక్తులు ఈ నీటిని గంగా జల సమానంగా పరిగణిస్తారు.
నీరు నిండిన పిడతల పైన ప్రమిదలను ఉంచి దీపం వెలిగించి ప్రార్ధిస్తే మనోభిష్టాలు నెరవేరుతాయి అన్నది భక్తుల విశ్వాసం.
ఇలా దీపాలు వెలిగించడానికి ఈశాన్యం లో శ్రీ లక్ష్మీ నారాయణ రూపాలను నెలకొల్పారు.
పచ్చగా పాచిపట్టినా, తామర పుష్పాలతో, ఆకులతో ఆకర్షణీయంగా ఉన్న కోనేరులో ముఖ పాద హస్తాలను పరిశుబ్ర పరుచుకొని ఆలయం వైపు వెళతారు భక్తులు.
ఉత్తరం వైపు రాజ గోపురం ఉన్నాప్రధాన ద్వారం మాత్రం తూర్పునే !
విరాట్ నిర్మాణాలు లేవు.
ద్వారానికి పైన గుమ్మటం లాగా ఉన్న నిర్మాణాలున్నాయి.
కళింగ ప్రాంత నిర్మాణ శైలి.
ఇలాంటివే శ్రీ కూర్మం, అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాలలో ఉంటాయి.
ద్వారం వద్ద రాతి మీద ఆలయ పురాణ చారిత్రక గాధల వివరాలను చెక్కి భక్తుల కొరకు ఉంచారు.
దాని ప్రకారం క్షేత్ర పురాణ గాధ ద్వాపర యుగం నాటిదిగా అర్ధమౌతుంది.
మాయా జూదంలో ఓడిన పాండు నందనులు అరణ్య వాసానికి తరలి వెళుతున్న సమయంలో శ్రీ కృష్ణుడు వారికి సీతా లక్ష్మణ సమేత శ్రీ రామ విగ్రహాలను ప్రసాదించి, భక్తి శ్రద్దలతో పూజిస్తే వనవాస కాలం చక్కగా గడిచి పోతుంది అని తెలిపారట.
అలానే చేస్తూ వచ్చిన పాండవులు వనవాస ఆఖరి రోజులు ఇక్కడ గడిపి, అజ్ఞాత వాసానికి వెళుతూ విగ్రహ సంరక్షణ, పూజాదికాల భాద్యత " వేద గర్భుడు" అనే బ్రాహ్మణునికి అప్పగించారట.
నాటి నుండి అనేక శతాబ్దాల పాటు ఆయన వంశం వారే ఇక్కడ నీలాచల పర్వత పై భాగాన పాండవులు నిర్మించిన ఆలయ నిర్వహణా భాద్యతలను చూసుకోనేవారట.
కానీ క్రీస్తు శకం రెండో శతాబ్ద కాలానికి ఈ ప్రాంతంలో ఒక దాని తరువాత ఒకటిగా జైనం మరియు బౌద్ధం ప్రాబల్యాన్ని సంతరించుకొన్నాయి.
వారి విగ్రహారాధనకు వ్యతిరేకులు.
నాటి జైనుల మరియు బౌద్దుల స్థూపాలను, ఆరామ, విహారాల శిధిలాలను పక్కనే ఉన్ననీలా చల , ఘని, దేవభక్తుల కొండల మీద నేటికీ చూడవచ్చును.
తూర్పు చాళుక్య రాజు విమాలదిత్యుని ( 1011 - 1022) కాలం నాటి శాసనం పర్వతం పైన ఆంగ్ల పరిశోధకులకు పంతొమ్మిదో శతాబ్దంలో లభించినది అంటారు.
వారి ప్రభావం వలన వేద గర్భుని వంశీకులు విగ్రహాలను నీటి మడుగులో దాచి ప్రాంతం విడిచి వెళ్లి పోయారట.
అలా సుమారు వెయ్యి సంవత్సరాలు అజ్ఞాతంగా నీటిలో ఉండిపోయిన శ్రీ రాముడు తిరిగి పదిహేడో శతాబ్దంలో ఆలయ ప్రవేశం చేసిన ఉదంతం కూడా విశేషమైనదే!
ఇక్కడికి సమీపంలోని "కుంభిలాపురం " ( నేటి కుమిలి) రాజధానిగా చేసుకొని పదహారో శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించే వారు పూసపాటి వంశం వారు.
నాటి ప్రజలలో చాలా మంది అటవీ సంపద మీద ఆధారపడి జీవనం సాగించేవారట.
అలాంటి వారిలో పుట్టు మూగ అయిన ముదుసలి కూడా ఒకరు.
ఒక నాడు ఆమె అడవిలోనికి వెళ్ళిన సమయంలో తీవ్ర గాలులతో పెద్ద వర్షం కురిసిందట.
ముసలమ్మ భయపడిపోయి ఒక చెట్టు క్రింద వానకు తడుస్తూ వణుకుతూ రామనామ జపం చేయసాగిందట
ఆ సమయంలో ఆమెకు శ్రీ రామచంద్రుడు దర్శనమిచ్చి భయపడవలదని, వాక్కును ప్రసాదించి, తను సమీపంలో ఉన్న కోనేరులో ఉన్న సంగతి తెలిపారట.
వాన వెలసిన తరువాత నగరానికి తిరిగి వచ్చిన పుట్టు మూగ మాట్లాడటం తెలిసి పిలిపించుకొన్న రాజు శ్రీ సీతా రామ చంద్ర గజపతి విషయం తెలుసుకొని తరలి వెళ్లి విగ్రహాలను వెలికి తీసి కొండ పైన, క్రింద ఆలయాలను నిర్మించారట.
తీర్ధం ( జాలం) లో లభించిన శ్రీ రాముడు కాబట్టి రామతీర్థమయింది
Post a Comment
Post a Comment