ఆకలిగొన్నవారికి అన్నదానం చేయటానికి, విద్యాదానం గరపటానికి, రైతుకు దానాదిసాయాలు చేయటానికి ముహుర్తాలు మీనమేషాలు లెక్కించాల్సిన పనిలేదు.
కాని దానం చేయటానికి పాత్రమైన జనులు, దానకారణం, దానసమయం ముఖ్యమని మన పూర్వీకులు తెలిపారు. ముఖ్యంగా సోమసూర్యగ్రహణకాలాలోనూ, ఉత్తరాయణ దక్షిణాయణ ప్రారంభరోజుల్లోనూ రాజుకు తల్లిదండ్రులకు గురువులకు పండితులకు సేవకులకు శ్రోత్రియులకు మేలుకలగాలని పుణ్యం కలగాలని అగ్రహారాలను,భూమిని, బంగారాన్ని, గోవులను, నూనెను దానం చేసేవారు. ఇంకా ఆలయ నిర్వహణకు అంగరంగవైభోగానికి, అమృతపడి వంటి నైవేద్యాల సమర్పణకు, అన్నదానానికి, గుడిరక్షణ మొదలైనవాటికి దానాలు చేసేవారు.
ఆ రోజులలో దశమహా దానాలను అనగా
(1) బంగారు (2) అశ్వం (3) నువ్వులు (4) హస్తి (5) సేవకులు (6) రథం (7) భూమి (8) గృహం (9) కన్య (10) కపిల (Dark Brown ) గోవులను
దానాలుగా ఇచ్చేవారు.
ఇంకా షోడశదానాలను చేసేవారు. ఈ దానాలేమిటంటే...
(1) హిరణ్యగర్భదానం అనగా కుండలో బంగారు పద్మాన్ని వుంచి శాస్త్రాక్త మంత్రోక్తపూర్వకంగా దానిని అర్హులకు దానం చేయడం.
(2) తులాపురుషదానమంటే తన బరువుకు సమానమైన బంగారు, వెండి, తామ్రం, ధాన్యం, వస్త్రాలు, పూలు మొదలైనవాటిని దానం చేయడం.
(3) బ్రహ్మండదానం :- వివరాలు పెద్దలు చెప్పగలరు.
(4) కల్పవృక్షదానమంటే బంగారు లేదా వెండి లేదా పంచలోహాలతో కల్పవృక్షాన్ని తయారు చేయించి దానం చేయడం.
(5) (🚩) గోసహస్ర దానమంటే వేయి గోవులను దానం చేయడం.
(6) హిరణ్యకామధేనువును దానం చేయడమంటే బంగారం, వెండి, రాగి (తామ్రం), పంచలోహాలలో ఒకలోహంతో చివరకు మట్టితోనైనా సరే కామధేనువు విగ్రహాన్ని తయారుచేయించి దానం చేయడం.
(7) (8) హిరణ్యాశ్వ, అశ్వరథ దానాలు అనగా పై చెప్పిన లోహాలతో గుర్రపుబొమ్మను, గుర్రంలాగే రథాన్ని తయారు చేయించి దానం చేయడం.
(9) హస్తిరథ దానమంటే పైన పేర్కొన్న లోహాలతో ఏనుగులు లాగే రథాన్ని చేయించి దానం చేయడం.
(10) ధర్మదాన (11) విశ్వచక్ర (12) కల్పలత (13) పంచలంగాళ (14) సప్తసాగర (15) మహభూతగత(16) రత్నధేను మొదలైన దానాలను చేసేవారు.
(🚩) షోడశదానాలలో గోసహస్ర దానమంటే వేయి గోవులను దానం ఇవ్వడమని చెప్పుకొన్నాం కదా !
ఆ గోదానాన్ని ఎలా చేసేవారో చూద్దాం.
మేలైన వేయిగోవులలో శ్రేష్ఠమైన పది ఆవులను తీసుకోవాలి, ఆరోగ్యంగాను బలిష్ఠంగాను వున్న ఎద్దు (కోడె)ను కలపాలి. అన్నింటికి పరిమళాభిషేకం (వళ్ళుకడగాలి) చేయించాలి. వాటికి కడుపునిండా మేతపెట్టాలి. అన్నింటిని నూతన వస్త్రాలతో అలంకరించాలి. కొమ్ములను బంగారు కుప్పెలతోనూ, గిట్టలకు వెండితో పొదిగిన కుప్పెలను పూలమాలతో అలంకరించి చప్పరంలోనికి తీసుకురావాలి. వాటి మధ్యన బంగారం, వెండి, తామ్రం( రాగి ) పంచలోహాలతో చేసిన నందీశ్వరుడి విగ్రహాన్ని వుంచాలి.
దాత సర్వ ఔషధాలతో మిలితమైన నీటిలో స్నానమాచరించి, పూలు పూమాలలు ధరించి, పూలను చేతిలోవుంచుకొని గో మహత్మ్యం పఠిస్తూ గోగణాన్ని పూజించాలి. నందికేశ్వరుడిని ధర్మదేవతగా దాత కీర్తించాలి.
తరువాత నందీశ్వరవిగ్రహాన్ని రెండుగోవులను గురువుకు సమర్పించాలి. మిగిలిన ఎనిమిది గోవులను పురోహితులకు దానం చేయాలి. కోడెను మిగిలిన 990 గోవులతో కలిపి, కొన్ని ఆవులను ఐదేసి ప్రకారం బ్రాహ్మణులకు దానమియ్యాలి. మిగిలిన కోడెను గోవులను రైతులకు దానమివ్వాలి.
ఇలా దానమివ్వడం వలన పెద్దలకు పుణ్యలోకాలు లభిస్తాయి. దాత శివ, వైష్ణవసాయుజ్యాన్ని పొందుతాడు.
ఉదా॥
అర్జునుడు గోదాన, భూదాన, హిరణ్యదానంబులాదిగా బెక్కు దానంబులు సేసి యజ్ఞార్థంబులుగా కర్షకభూసురోత్తములకు గోసహస్రములిచ్చి... ఆంధ్రమహాభారతం, ఆదిపర్వం.

Post a Comment
Post a Comment