అల్లవరంలో గోవర్ధనం అనే భూస్వామి ఉన్నాడు.
ఉన్నదానిలో తృప్తిపడక ఆయనకు మనశ్శాంతి అనేది లేదు.
ఆ విషయం గ్రహించిన భార్య ఆయన మనసు మార్చడానికి చతురుడైన తన అన్న పీతాంబరాన్ని పిలిపించింది.
పీతాంబరం వచ్చి, “ఈ ప్రపంచంలో ఎందరికో ఎన్నోలేవు. అన్నీ ఉన్న నీవంటి అదృష్టవంతులు
అరుదుగా ఉంటారు" అన్నాడు.
"మనశ్శాంతి లేకపోయాక ఎన్నుంటే ఏం లాభం?" అని వాపోయాడు గోవర్ధనం.
"మనశ్శాంతి ఒకరిస్తే వచ్చేది కాదు. మన మనసును అదుపు చేసుకొనడంలో ఉంటుంది" అన్నాడు పీతాంబరం.
“నాకు మనసు మీద అదుపు లేదనుకున్నావా? నా బాధంతా నాలుగెకరాల మెట్టు పొలం
గురించి" అన్నాడు
గోవర్ధనానికి వందెకరాల మాగాణితో పాటు
నాలుగెకరాల మెట్ట పొలముంది.
అందులో ఏ వంటా పండదు. అమ్ముదామంటే ఎవరూ కొనడం లేదు. చాలా ఏళ్ళుగా అది నిరుపయోగంగా ఉందని ఆయనకు బాధ!
"ప్రస్తుతానికిదో వంక. అది తీరితే ఇంకొకటి ఆయనకు అర్థమయ్యేలా చెప్పు " అంది. గోవర్ధనం భార్య తన అన్నగారితో..
"నీకెందుకూ? నా చాతుర్యంతో ఆ మెట్ట పొలం అమ్మించి బావకు మనశ్శాంతి చేకూర్చుతాను” అన్నాడు పీతాంబరం.
మర్నాటి నుంచీ గోవర్ధనం మెట్ట పొలంలో లంకెల బిందులున్నాయన్న ప్రచారం వచ్చి అల్లవరంలో అందరికీ తెలిసింది. అయితే .. గోవర్ధనం గురించి తెలిసిన వారెవ్వరూ ఇది నిజమని నమ్మలేదు.
ఇలా ఉండగా సీతయ్య అనేవాడు స్వంత ఊళ్ళో ఆస్తులన్నీ తెగనమ్ముకుని అల్లవరం వచ్చాడు.
అతనికి గోవర్ధనం మెట్ట పొలం గురించి తెలిసింది.
సీతయ్య ఆ మాటలు నమ్మాడు. అందుకని వాడు మామూలు కంటే కూడా
కాస్త ఎక్కువ ధరే ఇచ్చి ఆ మెట్ట పొలాన్ని కొన్నాడు.
గోవర్ధనం పీతాంబరం తెలివిని మెచ్చుకుని, "నువ్వు ఇక్కడుండి వెళ్ళు. మనశ్శాంతితో ఉండగా నీతో గడపాలని ఉంది"? అన్నాడు.
పీతాంబరం సరేనని ఉండిపోయాడు.
నాలుగు రోజుల తర్వాత ఒక సాయంత్రంపూట బావమురదు లిద్దరూ పెరట్లో కూర్చుని ఉల్లాసంగా కబుర్లాడు కుంటూంటే ఎక్కణ్ణించో పాలేరు పరుగు పరుగున వచ్చి, "బాబయ్యా! ఇది విన్నారా? సీతయ్య ఇంటివునాదుల కోసం మన పొలంలో త్రవ్విస్తున్నాడు. లంకెల బిందెలు దొరికాయట" అన్నాడు.
అంతే...గోవర్ధనానికి మతిపోయింది.
మనశ్శాంతి ఆయన్ను శాశ్వతంగా విడిచిపెట్టింది.
తర్వాత పితాబరం బావగారికి మనశాంతిని కలిగించే ప్రయత్నం మరి చేయలేదు.
🌻🌸🌻🌸🌻🌸🌻🌸🌻
ఆశాయాః యే దాసాః , తే దాసాః సర్వ లోకస్య ।
ఆశా యేషాం దాసీ, తేషాం దాశాయతే లోకః ॥
ఆశకి ఎవరైతే దాసులో వారు సమస్త లోకానికీ దాసులు. ఆశ ఎవరికైతే దాసియో అటువంటి వారికి సమస్త లోకమూ దాసియే!
🌻🌸🌻🌸🌻🌸🌻🌸🌻
Post a Comment
Post a Comment